ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా వైరస్ ప్రభావం అంతగా లేదు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ సమావేశమై కరోనాను అరికట్టేందుకు ఢిల్లీలో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలను తీసుకున్నామని తెలిపారు. జనవరి 18వ తేదీ నుంచి దేశంలో ప్రముఖమైన ఏడు ఎయిర్‌పోర్టులలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఇప్పుడు 30 ఎయిర్‌పోర్టులలో స్క్రీనింగ్ కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు 8,74,708 మంది ప్రయాణికులను స్క్రీనింగ్ చేశామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఒక వేళ ఢిల్లీలో కేసులు పెరిగితే ఏం చేయాలనే అంశాలపై ఢిల్లీ ప్రభుత్వంతో చర్చించామని తెలిపారు. ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు, క్వారంటైన్ సౌకర్యాలు, డాక్టర్ల లభ్యతతో ఇతర అంశాలు చర్చకు వచ్చాయని హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 43కి చేరుకుంది.
మన దేశంలో కరోనా ప్రభావం లేదు : కేంద్ర మంత్రి